మక్కా మస్జీద్ జుమ్మా నమాజులు... 1857 జూన్ 13 మద్యాహ్న సమయం.
జుహర్ నమాజుల కోసం మక్కా మసీదు ప్రాంగణంలో అందరూ సమావేశమవుతున్నరు. కాని అందరి ముఖాలలో ప్రశాంతత కరువైంది. ఆందోళన, భయం అందర్నీ కమ్ముకుని ఉంది. దానికి కారణం మక్కా మసీదు గోడల మీద, తలుపుల మీద అంటించిన పెద్ద పెద్ద చేతిరాతల పోస్టర్లు. తెల్లని కాగితాల మీద ఆకుపచ్చ రంగుల రాతలు. ”ఫిరంగీలందరు కాఫిర్లు వారికి వ్యతిరేకంగా జిహాద్ చేయండి.” ”కిరస్తానీ సువ్వర్లను వధించండి.అల్లా అనుగ్రహం మన వెంట ఉంటుంది”. ”ఇట్ల గోడల మీద అంటించిన పెద్ద పెద్ద కాగితాలను నేను నిన్న బేగంబజార్ల భీ చూసిన” ఒక మౌలానా మరో మౌలానా చెవిలో గుసగుసగా అన్నాడు.
”అక్కడ కొంత మంది హిందూ సేఠ్లు, షావుకార్లు ఈ ఇంక్విలాబ్కు మదద్ చేస్తున్నరట. నిన్న సాయంత్రం చార్మినార్ చబూత్ర మీద కూచున్నప్పుడు అక్కడ నడుస్తున్న బాతఖానీలో ఆ మాట చెవిల బడింది.” ”ఆఁ సరేలే. చార్మినార్ దగ్గరి మాటలు నీటి మీది మూటలు. పని పాటా లేని బేకార్, బేరోజ్గార్లందరూ అక్కడ జమయ్యి హవామే పుకార్ పైదా కర్తే హై. అందరూ బాతాల పోతురెడ్డిలే. ఛీల్ ఉడీ అంటే భైంస్ ఉడీ అనే రకాలు… చార్మినార్ దగ్గర షికార్లు పుకార్లు అన్న సామెత కుతుబ్షాహీల కాలం నుండీ ఉండనే వుంది. కట్టుకథలకు, పిట్ట కథలకు చార్మినార్ మూల కేంద్రం. అందుకే ఆ మాటలు నిజమని నేనయితే నమ్మను.”
”అరే అల్లా. ఖుదా కే వాస్తే వైసా మత్ బోలో. చార్మినార్ దగ్గరి షికార్ల పుకార్లు, అక్బార్ల ఖబర్లు అన్ని అసల్ సిసల్ అవ్వల్ దర్జానే ఉంటయి. ఊదు కాలందే పొగ లేస్తదా? కాని అక్కడ చార్మినార్ గోడల మీద ఇంకో రకం రాతలున్నవి.” ”వో క్యా హై” ”మొగల్ బాదుషా బహద్దూర్ షా జఫర్ జిందాబాద్. అంగ్రేజోఁకా హుకుం ముర్దాబాద్.” ”ఈ కాగితాల మీది రాతలను చదువని వానిని అల్లా శిక్షిస్తాడు” అని రాశారు. ”యా అల్లా. ఖయామత్ కా దిన్ ఆగయా” అని వెనక ఖాజీసాబ్ పక్కనున్న మరో మౌల్వీసాబ్ తన భయాన్ని పంచుకుంటున్నాడు.
ఆ రాతలు కొందరిలో భయాన్ని మరికొందరిలో ఉత్సాహ ఉద్రేకాలను కలిగిస్తున్నాయి. దానికి తగ్గట్టే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని నగర కోత్వాల్ మక్కా మసీదు అవుతల జబర్దస్త్ బందోబస్తు ఏర్పాటు చేశాడు. అరబ్బు సైనిక పటాలం లాఠీలు, బరిసెలు పట్టుకుని కవాతులు చేస్తున్నారు. గస్తీ కాస్తున్నారు. కుఫియాలు అందించిన సమాచారం ఆధారంతో దివాన్ సాలార్జంగు గడ్బడ్లు జరుగుతాయి అన్న ముందుచూపుతో నిషేధాజ్ఞలు కూడా విధించాడు. లష్కర్ బోయిన్పల్లి, కంటోన్మెంట్ పరిసరాలలో కూడా అటువంటి పోస్టర్లను గోడలకు అంటించారు. సర్కార్ వాటన్నింటినీ చింపి వేయించింది, తొలగించింది. ప్రజలందరూ పరేషాన్ పరేషాన్గ, బహురాన్ బహురాన్గ ఉన్నారు. బేగంబజార్లో అట్లా తొలగించిన పోస్టర్ల స్థలంలో ఎవరో కోతి కవి ఇట్లా రాశాడు. ”సర్కార్ కే సామ్నే నహీఁ చల్నా
ఔర్ గధే కే పీచే నహీఁ చల్నా
నహీఁ తో వో లాత్ మార్తే”
అంత ఉద్రిక్త సమయంలో కూడా ఆ రాతల్ని చదివి ప్రజలు పక్కున నవ్వారు.
మక్కా మసీదులో నమాజుల కోసం పోగైన సమూహాలను ఉద్దేశించి ఇమామ్ తన రోజువారీ సహజ ధోరణిలో ఖురాన్ సూక్తుల్ని వల్లిస్తున్నాడు. ఎవరూ వినటం లేదు.
”ఆపు నీ వ్యర్థ ప్రసంగం” అని ఓ యువకుడు లేచి బిగ్గరగా అరిచాడు.
అందరూ ఉత్కంఠతతో ఆ యువకుని వైపు చూశారు.
అతని పేరు అక్బర్ మౌల్వీ. రోహిల్లా పఠాన్. పొడుగు జుబ్బా, కింద వదులు పైజామా, తలకు చుట్టిన పెద్ద షమ్లా, పొడవైన గడ్డం, ఆజానుభావుడిగా అతని ఆకారం అందర్నీ ఆకర్షించింది. ”ఆడదానిలా ఎందుకు గొణుగుతావ్. ధైర్యం లేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో ఓ మూలకు కూచో. ధైర్యముంటే మొగాడిలా మాట్లాడు. ఈ వతన్లో ఫిరంగీల జులుంకు ఖిలాఫ్గా నడుస్తున్న జిహాద్ గురించి మాట్లాడు. కలేజా వుంటే నైజాం సర్కార్, దివాన్లు ఇద్దరూ ఈ జిహాద్లో చేరి అంగ్రేజి హుకుమత్ను ఖతం చేయమని మాట్లాడు. మేరే భాయి, అజీజ్ దోస్తో ఆప్ హమ్కో మదద్ కరో. అల్లా అప్నే సాత్హై” అని ఆ యువకుడు ఆవేదనగా అక్కడి సమూహాన్ని రెచ్చగొట్టే ఉపన్యాసం ఇవ్వసాగాడు. ఈలోగా ఎవరో మసీదు పైకి ఎక్కి నెలవంక ఉన్న ఆకుపచ్చ పవిత్ర పతాకాన్ని ఎగురవేశాడు. అక్కడ చేరిన ప్రజలు ”దీన్దీన్” అని అతని పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ”అల్లా హో అక్బర్” అని నినాదాలు ఇస్తున్నారు. ఆ మసీదు అంతా హల్చల్కు లోనయ్యింది. ఇంతలో నగర కోత్వాల్ అరబ్బు సైనిక పటాలంతో ప్రాంగణంలోకి చొచ్చుకొచ్చి ”కౌన్ హై ఓ బద్మాష్ బగావత్. పక్డో. గిరఫ్తార్ కరో” అని రంకెలు వేస్తున్నాడు. ఇంతలో ఆ విప్లవకారుడు నీటిలో చేపలా ప్రజల మధ్యన మాయమైనాడు. అతని అనుచరులు గప్చుప్. మళ్లీ అంతా ప్రశాంతత. తుఫాను ముందు ప్రశాంతత. లోలోపలే కుతకుతా ఉడుకుతున్న లావా. పేలబోయే అగ్నిపర్వతం.
”మా జమానా నాటి వహాబీ ఉద్యమం మళ్లీ షురువయ్యినట్లుంది” ఒక వృద్ధుడు తనలో తాను గొణుక్కుంటున్నాడు.
తెరవెనుక కథ
ఇస్లాంకు పూర్వ వైభవాన్ని సంపాదించాలన్న పవిత్ర ఆశయంతో సౌదీ నగరానికి చెందిన అబ్దుల్ వాహెబ్ నెజ్దీ ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు. అదే వహాబీ ఉద్యమంగా పేరు పొందింది. అఫ్ఘనిస్తాన్లోని పెషావర్ కేంద్రంగా 1830లో భారతదేశంలోకి ఈ ఉద్యమం ప్రవేశించి అంగ్రేజీ హుకుంకు ఖిలాఫ్గా, కిరస్తానీ కాఫిర్ల ప్రచారాలకు వ్యతిరేకంగా బలంగా రూపుదిద్దుకుంది. మన దేశంలో వహబీ ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు ‘షా వలీఉల్లా దెహ్లవీ”. ఇతను అనేక మంది అనుచరులను తయారు చేసి దేశమంతటా పంపించాడు. ఫకీర్ల రూపంలో వీరు సంచరిస్తూ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని కూడగట్టేవారు. ఇస్లాం మతం పునాదిగా ఇదొక రాజకీయ విప్లవోద్యమం. ఫలితంగా పెద్ద ముస్లిం సైన్యం నిర్మించబడింది.
దక్షిణ భారతదేశంలో కూడా ఈ ఉద్యమం బాగా విస్తరించింది. అంతా రహస్య నిర్మాణమే. రహస్య ఉద్యమమే. ఆ ఉద్యమకారులను గుర్తించటం అంత సులభమైన పని కాదు. వారు ఎడమచేతి వేలికి ఉంగరాన్ని, ఎడమ చేయికి గాజుల్ని వేసుకునేవారు అంకెలు వేసిన తాయెత్తులను ధరించేవారు. అదే వహాబీ విప్లవకారుల గుర్తు. వారికి డబ్బు కాని ఇతర వస్తువులు కాని అవసరమైనప్పుడు ఆ సంకేతాలని చూపించి సహాయం పొందేవారు. ప్రజల అభిమానాన్ని వారు సంపాదించారు. 1838లో హైద్రాబాద్ సంస్థానంలోకి విలాయత్ అలీ, సలీం అనే ఇద్దరు వహాబీ ఉద్యమకారులు ప్రవేశించి త్వరలోనే దక్షిణ భారతదేశమంతా పట్టు సాధించారు. కర్నూలు నవాబు గులాం రసూల్ ఖాన్ వారితో చేతులు కలిపి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి బందీ అయ్యారు. అతడిని మద్రాసు జైలులో పెట్టారు. అంతకు ముందే 1799లో కర్నూలును నైజాం రాజ్యం నుండి విడదీసి మద్రాస్ ప్రసిడెన్సీలో విలీనం చేసే సరికి హైద్రాబాద్ ప్రజల మనోభావాలు తీవ్రంగా గాయపడినాయి. ఇక హైద్రాబాద్లో నిజాం నవాబు స్వంత సోదరుడు ముబారిజుద్దౌలా బాల్యం నుండీ ఫిరంగీలకు, వారి ఆధిపత్యానికి వ్యతిరేకి. అతను స్వతంత్ర వ్యక్తిత్వం కలవాడు. ముబారిజుద్దౌలా వహాబీ ఉద్యమాన్ని సంపూర్ణంగా సమర్థించి చేయూతనిచ్చాడు. దానితో హైద్రాబాద్ నగరంలోని రాజ కుటుంబీకులలో సామాన్య ప్రజలలో వహాబీ ఉద్యమం బలంగా వేళ్లూనుకుంది. హైద్రాబాద్లోని బ్రిటిష్ రెసిడెంట్ నిజాంపై వత్తిడి తెచ్చి ముబారిజుద్దౌలాపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిపి 1840లో అతనిని అరెస్టు చేసి గోల్కొండ కోటలో బంధించారు. బందీగా ఉండి కూడా అతను ప్రభుత్వ ఖజానాను తన అనుచరులతో దోపిడీ చేయించి ఆ డబ్బుతో వహబీ ఉద్యమాన్ని విస్తరించాలని, నైజాం రాజ్యంపై అంగ్రేజీల పెత్తనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలం చెందాడు. ఆ తిరుగుబాటు వీరుడు 14 సంవత్సరాలు గోల్కొండ కోటలోనే బందీగా కృంగి కృశించి తుదిశ్వాస విడిచాడు. అతను మరణించినా ప్రజలలో వహాబీ ఉద్యమం పట్ల సానుభూతి మాత్రం తగ్గలేదు. ఆ ఉద్యమాన్ని నైజాం నవాబు సమర్థించలేదని నగర ప్రజలు లోలోపల అసంతృప్తితోనే ఉన్నారు. అదే ‘వహాబీ’ ఉద్యమం.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు 1853లో నైజాం రాజ్యంలో అంతర్భాగమైన ‘బీరార్’ను ఆంగ్లేయులు కైవసం చేసుకున్నారు. నైజాం ఆర్థిక పరిస్థితి దివాలా తీసి, ఈస్టిండియా కంపెనీ వద్ద తీసుకున్న అప్పుల్ని తీర్చలేక, నిస్సహాయుడైన నిజాం కక్కలేక మింగలేక ‘బీరార్’ విషయంలో మౌనంగా ఉండిపోయాడు. బీరార్లో పత్తి బాగా పండేది. ఇంగ్లాండులో బట్టల మిల్లులకు కావాల్సిన పత్తి కోసం ఆంగ్లేయులు బిరార్ను గుటుక్కున మింగారు. హైద్రాబాద్ ప్రజలు మాత్రం ఆ అవమానాన్ని భరించలేకపోయారు. కర్నూలు తర్వాత బీరార్ కూడా పోయింది.
వహాబీ ఉద్యమం జ్ఞాపకాలకు తోడు ఈ బీరార్ సంఘటన పుండు మీద కారం రాసినట్లయింది. క్రిస్టియన్ మిషనరీ మత ప్రచారం, మత మార్పిడులు వారికి నచ్చలేదు. తర్వాత 1857లో ఉత్తర భారతదేశంలో ‘సిపాయిల తిరుగుబాటు’ ప్రారంభమయ్యే సరికి ఇక్కడి ప్రజలు దానికి సహజంగానే ప్రతిస్పందించారు. దీని ఫలితమే లష్కర్, బేగంబజారు, మక్కా మసీదులలో ఫిరంగీలకు ఖిలాఫ్గా పోస్టర్లు అంటించబడ్డాయి. పాత గాయాలన్నీ మళ్లీ సరికొత్తగా బాధపెట్టటం వలన ప్రజలు ఢిల్లీ, మీరట్, అవధ్, లక్నోలలో జరుగుతున్న సిపాయిల తిరుగుబాటు పట్ల ఆకర్షితులయ్యారు. అటువంటి విపత్కర పరిస్థితులలో కనీసం దక్షిణ భారతదేశాన్నైనా ఆ తిరుగుబాటు జ్వాలల నుంచి రక్షించుకోవాలని బ్రిటిష్వారు తాపత్రయపడ్డారు. దేశంలోని 500ల సంస్థానాలలో అతిపెద్దది నిజాం హైద్రాబాద్ సంస్థానం. ఈ సంస్థానం మొత్తం దక్షిణ భారత దేశానికి గుండెకాయ లాంటిది. నైజాం రాజ్యంలో తిరుగుబాటు జరిగితే అది అటు నాగుపూర్ని ఇటు మద్రాస్ని నిప్పుల కుంపటిగా మారుస్తుంది. హైదరాబాద్ సంస్థానంలోని జనాభాలో 15 శాతం ముస్లింలు. ఒక వేళ నైజాం నవాబు ఆ తిరుగుబాటుకు మద్దతు ఇస్తే మొత్తం దక్షిణ భారత దేశంలోని ముస్లిం ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధం అవుతారు. హైద్రాబాద్ నగరంలో పెద్ద సంఖ్యలో తమిళులు, మరాఠీలు, కన్నడిగులు వున్నారు. వారు కూడా తిరుగుబాటులో పాల్గొంటే మరాఠా, మద్రాసు, మైసూరు ప్రజలు కూడా ఆ తిరుగుబాటులో పాల్గొనే ప్రమాదముంది.
అప్పటికే మైసూరులో టిప్పుసుల్తాన్ వీరమరణాన్ని ముస్లింలు ఇంకా మరిచిపోలేదు. వహాబీల ప్రేరణతో కేరళలో ”మొప్లా ముస్లింలు” తిరగబడుతున్నారు. మద్రాసీ ముస్లింలు కూడా అదే బాటలో వెళ్లాలని ఆలోచనలు చేస్తున్నారు. అటువంటి క్లిష్ట సమయంలో కనీసం హైదరాబాద్ సంస్థానాన్నైనా రక్షించుకోవాలని బ్రిటిష్వారు పథకాలు వేసి నిజాం నవాబును తమ ఉచ్చులో బిగించారు. పైగా ”సిపాయిల తిరుగుబాటు”ను అంతమొందించగానే బీరార్ను వాపస్ ఇచ్చేస్తామని, అప్పుల్ని మాఫీ చేస్తామని ఆశలు కల్పించారు. ఒకవేళ హైదరాబాద్ చేజారితే మొత్తం భారతదేశమే చేజారుతుందని ఇంగ్లీషు వారు భయపడ్డారు. ”ఊరంతా ఒక దారి ఉలిపికట్టెది ఇంకోదారి” అన్నట్లు నిజాం నవాబు, ఆయన దివాన్ సాలార్జంగు హైద్రాబాద్ సంస్థానంలోని తిరుగుబాట్లను అణచటానికి నడుంకట్టారు. ఒక నెల ఆలస్యంగా 1857 జూన్ నెలలో హైద్రాబాద్ సంస్థానంలో తిరుగుబాట్లు తలెత్తాయి. నానాసాహెబ్, తాంతియాతోపే అనుచరులు సాధువులు, సన్యాసులు, వైద్యులు ఫకీర్ల వేషాలలో హైద్రాబాద్ సంస్థానంలోని అనేక గ్రామాలలో తిరుగుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని సమీకరిస్తున్నారు. మసీదులలో మౌల్వీలు ‘జిహాద్’ ప్రాముఖ్యతను బోధిస్తున్నారు. హిందువులు యక్షగానాల రూపంలో ధర్మయుద్ధాన్ని ప్రబోధిస్తున్నారు. ఈ తిరుగుబాట్ల పుణ్యమా అని వెయ్యేళ్ల తరవాత భారతదేశంలో హిందూ ముస్లిం, గంగా యమునాల సంగమం అందర్నీ సంతోష పరిచింది. ఔరంగాబాద్లో జరిగిన సిపాయిల తిరుగుబాటును బ్రిటిష్ సైనికాధికారులు రక్తసిక్తంగా క్రూరంగా అణిచివేశారు. అయితే ఈ విషాద గాథ అంతటితో అయిపోలేదు. జమేదార్ చీతాఖాన్ నాయకత్వంలో 13 మంది సైనికులు ఔరంగాబాద్ నుండి తప్పించుకుని హైద్రాబాద్ చేరి నిజాం శరణుజొచ్చారు. నిజాం నవాబు తమని అర్థం చేసుకొని క్షమాభిక్ష ప్రసాదిస్తాడనీ, రక్షిస్తాడని, ఈ నేల మీద సంచరించే ఆ భగవంతుని నీడ అతనేనని ఆ అమాయకులు ఆశపడ్డారు. కాని నిజాం ఎటువంటి కనికరం లేకుండా మీరు నా సేవకులు కాదు ఇంగ్లీషు వారి సేవకులు అని చెప్పి వారందరినీ విచారణ నిమిత్తమై కోఠిలో వున్న రెసిడెంట్కు అప్పజెప్పాడు. వారి పరిస్థితి పెనం నుండి మండుతున్నపొయ్యిలోకి దూకినట్లయింది. వారు రెసిడెన్సీలోని నేలమాళిగలో బందీలుగా వుండి చిత్రహింసలకు గురవుతున్నారు. ఇంకా విచారణ తేదీలు నిర్ణయించబడలేదు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారు. లోలోపల కుమిలిపోతున్నారు. ఆ రోజు 1857 జులై 17. ఖయామత్ కా దిన్ రానే వచ్చింది.
ఖయామత్ కా దిన్
ఆ రోజు శుక్రవారం. పవిత్రమైన మొహర్రం మాసం. అసర్ నమాజుల కోసం మక్కా మసీదులో అందరూ జమ అవుతున్నారు. ఇమామ్ గారి ‘జమాత్’ ఇంకా ప్రారంభం కాలేదు. మళ్లీ అవే రాతలు. అవే పోస్టర్లు. ఈసారి ఏకంగా నిజాం రాజునే నిందిస్తూ పోస్టర్లు. నిజాం, దివాన్ - ఇద్దరూ అంగ్రేజీలకు వెన్నెముక లేని గులామ్లని నిందాపూరిత వ్యాఖ్యలు. మరో పోస్టరులో ”అల్లా, మహమ్మద్ ప్రవక్త సాక్షిగా జిహాద్ కోసం ఫత్వా జారీ చేయాలని లేకపోతే నిజాం ఏడు తరాలవాళ్లు నాశనం అవుతారని” బెదిరింపులు. ”ధైర్యం లేని వాళ్లు గాజులు ధరించి ఇంట్లో మూలకు కూచోవాలని” పరుష వ్యాఖ్యలు. రెసిడెన్సీలో బందీలుగా వున్న చీతాఖాన్ని అతని సహచరులని వెంటనే విడుదల చేయాలని నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అరబ్బు సైనికుల పహారా ఆ రోజు మక్కా మసీదు ముందు అంతగా లేదు. సహజంగానే అరబ్బులకు, రోహిల్లాలకు మధ్య ఉప్పు నిప్పు సంబంధం. అరబ్బులు అరేబియా నుండి వచ్చినవారు. రోహిల్లాలు ఆఫ్ఘనిస్థాన్కు చెందిన పఠాన్లు కొండజాతివారు. వారి మధ్య పెళ్ళి సంబంధాలు, ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు లేవు. నిజాం సైన్యంలో కూడా వారికి ప్రత్యేకమైన పటాలాలు, బ్యారెక్సులు ఉండేవి. హైద్రాబాద్లో జరిగిన 1857 తిరుగుబాటులో రోహిల్లాలు చురుకుగా పాల్గొని నాయకత్వం వహించారు. వారికి వ్యతిరేకంగా అరబ్బు సైనికులు పని చేశారు. అది జాతుల మధ్య వైరం. నమాజులు చదివిన తర్వాత అక్కడ గుమిగూడిన జన సందోహం నగరంలో, సంస్థానంలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా చర్చించింది. చివరికి నలుగురు మౌల్వీల ప్రతినిధి బృందాన్ని నిజాం నవాబు వద్దకు పంపి రెసిడెన్సీలోని చీతాఖాన్, ఇతర బందీల విడుదలకై విజ్ఞప్తి చేయాలని నిర్ణయం జరిగింది. ఆ నలుగురు మౌల్వీల ప్రతినిధి వర్గం అల్లా ఆశీస్సులతో మక్కామసీదు, లార్డ్ బజార్ పక్కనే వున్న ‘చౌ మహల్లా’ నిజాం అధికార నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆ నలుగురు మౌల్వీలలో సయ్యద్ అల్లా ఉద్దీన్ మౌల్వీ ఒకరు. ”అయినను పోయి రావలెను హస్తినకు” అన్నట్లు ఆ రాయబారం మీద మౌల్వీ అల్లావుద్దీన్కు మొదటి నుండి భ్రమలు లేవు. అతనూ అతని మిత్రుడు తుర్రేబాజ్‌్ఖాన్ అనే మరో రోహిల్లా వీరుడు ”చేసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ ముందే పూర్తి చేసుకున్నారు” దెబ్బకు గాని దయ్యం జడవదని వారికి బాగా తెలుసు. వందలాది మంది అనుచరుల వత్తాసు, బేగంబజారు, కోఠీలలో వున్న హిందూ షావుకార్ల ఆర్థిక మద్దతూ వారికుంది. ఇంకా దూరదూరంగా వున్న జమీందార్లు, చిన్న చిన్న రాజులు ఆర్థిక, సైనిక సహకారాన్ని అందిస్తామని వాగ్దానాలు చేశారు. పై నుండి నానా సాహెబ్, రావు సాహెబ్ పీష్వా, తాంతియా తోపేల ఆశీర్వాదాలు ఉండనే ఉన్నాయి. ‘సర్ కటా సక్తె హైఁ. లేకిన్ సర్ జుకా సక్తే నహీఁ’ అనేది వారి అభి’మతం’. అనుకున్నట్లుగానే రాయబారం విఫలమయ్యింది. వేలాడే ముఖాలతో ముగ్గురు మౌల్వీలు మక్కా మసీదుకు ఉత్తి చేతులతో వాపస్ వచ్చారు. మౌల్వీ అల్లా ఉద్దీన్ మాత్రం అక్కడికి చేరుకోలేదు. అతను వీరుడు. వీరుల తీరే వేరు.
సమయం సాయంత్రం 4.45.
నిజాం వద్ద చర్చలు విఫలమైన సంగతి దివాన్ సాలార్జంగు వెంటనే కోఠీలో వున్న రెసిడెంట్ కర్నల్ డేవిడ్సన్కు ప్రత్యేకమైన కుఫియా ద్వారా తెలియచేసి, ఇప్పుడే సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో రెసిడెన్సీపై దాడి జరుగ వచ్చేమో అనే రహస్య సమాచారాన్ని కూడా అందచేశాడు. ఇప్పుడు చీకటి పడుతుంది కావున తాను వెంటనే అదనపు అరబ్బు సైనిక దళాలను పంపలేనని, ఆ చీకట్లో మా సైనికుల మీదనే మీరు తిరుగుబాటుదారులని కాల్పులు జరిపే ప్రమాదం ఉంది కావున మరునాడు సూర్యోదయం అయ్యే దాకా ఆగాలని వర్తమానం అందించాడు. అయ్యవారు వచ్చేదాకా ముహూర్తం ఆగదన్న సంగతి కర్నల్ డేవిడ్సన్కు బాగా తెలుసు. అతను ధైర్యశాలి, మొండివాడు. దాడి జరుగుతుందని అతను ముందే ఊహించి సిద్ధంగా ఉన్నాడు కావున వున్న దళాలతోనే తక్షణ రక్షణ చర్యలను చేపట్టాడు. రెసిడెన్సీ రెండు గేట్లను మూసివేయించి వాటి వెనుక మరఫిరంగులను నిలబెట్టాడు. అందుకే ఫిరంగీలన్నారు వాళ్లని. అతని వద్ద పని చేసే విశ్వాసపాత్రులైన ముస్లిం దుబాసీలు, మున్షీలు ప్రమాదం ముంచుకొస్తుందనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాకు పారిపోయి తలదాచుకొమ్మని ఎంత వేడుకున్నా అతను వినలేదు. తిరుగుబాటుదారుల హిట్లిస్టులో తను మొదటి టార్గెట్ అని తెలిసినా రెసిడెన్సీని విడిచి వెళ్లవద్దని నిర్ణయించుకున్నాడు. తనకు ఏదైనా అంతగా అత్యవసర పరిస్థితి, ప్రమాదం ముంచుకొస్తే రెసిడెన్సీ రహస్య సొరంగం ద్వారా చార్మినార్కు, మళ్లీ అక్కడ్నుండి ఇంకో సొరంగం ద్వారా చౌమహల్లా లేదా గోల్కొండ కోటకు పరారీ కావొచ్చని అతని ధీమా. ప్రమాదం లేదా ప్రాణహాని జరిగితే నిజామే దానికి బాధ్యత వహించాలని పరోక్షంగా హెచ్చరిక చేసి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా బెదిరించాడు. పాపం నిజాం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా మారింది. ”అల్లా హో అక్బర్” నినాదాలతో సైదాబాద్ మైదాన్ నుండి మౌల్వీ అల్లా ఉద్దీన్ నాయకత్వంలో తిరుగుబాటు వీరుల సైన్యం బయలుదేరింది. చాలా మంది చేతులలో తుపాకులు, బరిసెలు, తల్వార్లు. అశ్వంపై అగ్రభాగాన వున్న అల్లా ఉద్దీన్ చేతిలో ఆకుపచ్చ పవిత్ర పతాకం. అందులో చాంద్ సితారా నెలవంక గుర్తులు. ఆ పటాలం జయజయనాదాలు చేస్తూ యుద్ద వీరగీతాలను ఆలపిస్తూ చంపా దర్వాజా, డబీర్పురా దర్వాజా, ఢిల్లీ దర్వాజాలను దాటి బేగం బజారు చౌరస్తా చేరుకుంది. దారిలో అనేక మంది ప్రజలు ‘దీన్దీన్’ అని అరుస్తూ పరిగెత్తుతూ వారిని అనుసరించారు. అప్పటికే బేగంబజార్ చౌరస్తాలో తుర్రేబాజ్ఖాన్ తన మూడు వందలమంది దండుతో సిద్ధంగా ఉన్నాడు. ఆ రెండు సైనిక ప్రవాహాలు కలిసిపోయి ఏకప్రవాహంగా మారి గౌలిగుడా, పుత్లీబౌలీల మీద నుండి కోఠీ చేరుకున్నాయి. పుత్లీబౌలీలలో వున్న షావుకార్లు జయగోపాల్ దాస్ పిత్తీ, అబ్బెన్ సాహెబ్, పెస్తోంజీల బంగ్లాలు తిరుగుబాటుదారులకు ఆశ్రయమిచ్చాయి. తిరుగుబాటును ముందే ఊహించిన రెసిడెంట్ వారం రోజుల నుండి లష్కర్ నుండి హైద్రాబాద్లోకి తిరుగుబాటుదార్లు చొరబడకుండా ఎన్ని గస్తీ, పహరా ఏర్పాట్లు చేసినా వాళ్ల కళ్లు గప్పి పుత్లీబౌలీలోని అనేక ఇళ్లల్లో, బంగ్లాల పైన తిరుగుబాటు దారులు జమ అయ్యారు. జయగోపాల్ దాస్ బంగ్లా మీద తుర్రేబాజ్ఖాన్, అబ్బెన్ సాహెబ్ బంగ్లా మీద మౌల్వీ అల్లా ఉద్దీన్లు తమ అనుచరులతో చేరి ‘సుబానల్లా’ అని స్మరించి తుపాకుల్ని రెసిడెంటు భవనంపైకి పేల్చారు. సంకుల సమరం మొదలయ్యింది. అల్లాహో అక్బర్ నినాదాలు అంబరాన్ని చుంబిస్తున్నాయి. మరో రెండు దళాలు రెసిడెన్సీ రెండు గేట్ల ముందు నిలబడి లోపలున్న ముస్లిం, హిందూ సైనికులను ఇవతలికి వచ్చి తమతో చేతులు కలపమని అరుస్తున్నాయి. వారి సహకారం లభిస్తుందని వీరు ఆశించారు. అనుకున్నట్లుగానే గేటు తీసుకుని ఆశ్వికదళం రిసాల్దార్ ఇస్మాయిల్ ఖాన్ ఇవతలికి వచ్చాడు. కాని వీరితో చేతులు కలుపటానికి రాలేదు. లోపల పెద్ద పెద్ద ఫిరంగులున్నాయని వాటి ధాటికి మీరు పిట్టల్లా రాలిపోతారని హెచ్చరించటానికి వచ్చాడు. మాట వినని తిరుగుబాటుదారులు అతనిపై కాల్పులు జరపగా అతను మళ్లీ లోపలికి పరుగెత్తాడు. రెండు వైపుల్నుండీ కాల్పుల వర్షం. ఫిరంగీలకు వ్యతిరేకంగా అరుపులు, నినాదాలు. ప్రజలు భయంతో ఇళ్ల తలుపులు మూసుకుని పిడుగులు పడుతున్నట్లు తుపాకుల మోతలు విని ‘అర్జునా, ఫల్గుణా’ అని వొణికిపోతున్నారు. చీకట్లు కమ్ముకున్నాయి. అయినా రెండు వైపుల నుండి తుపాకులు కాలుస్తూనే వున్నారు.
1857 జూన్ 18 శనివారం సూర్యోదయమయ్యింది.
చాదర్ఘాట్ వంతెన వైపు నుండి సాలార్జంగు పంపిన అదనపు అరబ్బు దళాలు కోఠీకి చేరుకున్నాయి. రెసిడెంటుకు బలం వచ్చింది. కోఠీ కోటలోపలున్న మిలిటరీ సెక్రెట్రీ మేజర్ బ్రిగ్సు ఫిరంగుల్ని సిద్ధం చేయించాడు. ఈలోగా పుత్లీబౌలీలో వున్న రొహిల్లా వీరులు అజీమ్ అలీఖాన్ ఇంటి గోడను పగులగొట్టి వీధుల్లోకి వచ్చారు. ముందుకు పరిగెత్తి కోఠీ గేట్లను బద్దలు చేసి నిప్పు పెట్టారు. గేట్లు కూలాయి కాని ఏం ఫాయిదా! లోపల్నుండి మరఫిరంగులు ఆకలిగొన్న సింహాల్లా ముందుకు దూకి గర్జించటం ప్రారంభించాయి. కోఠీ చౌరస్తాలో రెండు ఫిరంగులు నిలుచుని ఒకటి ఇటు బ్యాంక్ స్ట్రీట్ వైపు, అటు పుత్లీబౌలీ వైపు మరొకటి మెడలు సాచుకుని గర్జిస్తున్నాయి. అధర్మ యుద్ధం. ఇటు మరఫిరంగులు అటేమో నాటు తుపాకులు, బరిసెలు, తల్వార్లు. రోహిల్లా వీరులు టపటపా కిందికి రాలిపోయారు. నిప్పుల్లో దూకిన శలభాలై పోయారు. చనిపోయిన వారిని రోడ్ల మీదే వదిలిపెట్టి గాయపడ్డ వారిని మాత్రం మోసుకుపోతున్నారు. సూర్యోదయమైన తర్వాత కొన్ని క్షణాల లోపలే అంతా ఉల్టాపల్టా అయిపోయింది. కొద్ది మంది అనుచరులతో ఆ ఇద్దరు వీరులు మాత్రమే మిగిలిపోయారు. ఓటమిని అంగీకరించని తుర్రేబాజ్ ఖాన్ బంగ్లా మీది నుండి ఇంకా కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. అబ్బెన్సాహెబ్ ఇంట్లో నుండి మౌల్వీ అల్లావుద్దీన్ ఇవతలికి వొచ్చి జయగోపాల్ దాస్ బంగ్లా మీద వున్న తుర్రేబాజ్ఖాన్ని కలిశాడు. ఒక్క క్షణం ఇద్దరూ ఒకళ్ల కళ్లలోకి ఇంకోళ్లు సూటిగా చూసుకున్నారు. ఇద్దరి కళ్లలోనూ కూలుతున్న కలలే కనబడ్డాయి. అయినా వారి పెదాల మీద ఓడిపోని చిరునవ్వులు. ”మనం ఓడిపోయాం మిత్రమా? వాగ్ధానాలు చేసిన మిత్రులంతా ఏరీ? సైన్యాలను పంపిస్తాం అన్నారు. తుపాకుల్ని అందిస్తాం అన్నారు. పైసలు పంపిస్తాం అని నమ్మించారు. ఏరీ వారంతా ఏరీ?” అని తుర్రేబాజ్ఖాన్ ఆవేదనతో బాధగా మౌల్వీ సాబ్ను అడిగాడు. ”నిజమే నిర్మల్ నుండి, కౌలాస్ నుండి, సురపురం నుండి రాజాలు జమీందార్లు అన్ని రకాల సహాయాలను అందిస్తాం అని వాగ్దానాలు చేశారు. కాని ఆ సహాయం అందలేదు. చివరికి మనిద్దరం మాత్రమే ఒంటరిగా మిగిలాం” విచారిస్తూ అన్నాడు మౌల్వీ.
”మనల్ని వదిలి పారిపోయిన మన అనుచరులది తప్పేం లేదు. వారి మీద నాకు కోపం లేదు. మొండిగా ఫిరంగుల గుళ్లకు బలి కావటం కంటే పారిపోవటమే మంచిది. మనకు మాత్రం ఏం తెలుసు లోపల ఫిరంగులున్నాయని? తుపాకులకు తుపాకులే సమాధానం అనుకున్నాం. కాని చిన్న పామును పెద్ద కట్టెతో కొడతారని మనకేం తెలుసు?” నిజాయితీగా తమ పొరపాటు వ్యూహాన్ని ఒప్పుకున్నాడు ఖాన్ సాబ్. ”సరే మరేం చేద్దాం?” మౌల్వీ నిస్సహాయంగా దీనంగా అడిగాడు. ”నేను ఇట్లనే ఈ జిహాద్ చేస్తూ చేస్తూ ఇక్కడే చనిపోతాను. ఇంక బతికేం లాభం? ఎట్లాగూ ఇది మొహర్రం మాసం. కనీసం అట్లనైనా నాకు పవిత్రమైన చావు లభిస్తుంది” నిర్వేదంగా మాట్లాడాడు ఖాన్సాబ్. ”నీ ఖుర్బానీ ఫిదాయికి సలాం చేస్తాను ఖాన్సాబ్! కాని ఈ ఫిరంగీలు నీ శవానికి శాస్త్రప్రకారం అంత్యక్రియలు చేస్తారని లేదా నీ మృతదేహాన్ని నీ కుటుంబానికి అప్పగిస్తారని అనుకుంటున్నావా? పవిత్రమైన చావు లభిస్తుందని ఆశ పడుతున్నావా?” ”మరి?” అయోమయంగా చూశాడు ఖాన్సాబ్. ”అమాయకుడా! ఔరంగాబాద్లో అమీర్ఖాన్, మీర్ ఫిదా అలీ శవాలు ఇప్పటికీ చెట్ల కొమ్మలకు వేలాడుతూనే ఉన్నాయి. రాబందులకు ఆహారంగా మారుతూనే ఉన్నాయి. కట్టర్ దుశ్మన్లకు కూడా అటువంటి చావు రావొద్దు” అన్నాడు మౌల్వీ. ”యా అల్లా. ఇంత బతుకు బతికి అంత ఘోరమైన చావా? అంత అనామకమైన చావా?” అని ఖాన్సాబ్ భయంతో కంపించాడు.
”అల్లా అనుగ్రహం ప్రకారమే అంతా జరుగుతుంది ఖాన్ భాయి! విచారించకు. మనిషి జన్మ ఎత్తినందుకు మన ధర్మాన్ని మనం నిర్వర్తించాం. మనుషుల్లా తలెత్తుకొని జీవించాం. ఫలితం అంతా అల్లాదయ. ప్రస్తుతానికి మనం ఈ నగరం వదిలి ఏ దూర దేశమైనా ప్రవాసం వెళదాం. భవిష్యత్తులో కాలం కలిసొస్తే మళ్లీ జిహాద్ చేసి ఈ రక్తాన్ని ఈ వతన్కే ధారపోద్దాం” అనునయంగా అన్నాడు మౌల్వీ. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి.
”పద. ఇప్పటికే ‘ఫజర్’ నమాజుకు సమయం మించిపోయింది. ఇక్కడే కాసేపు నమాజు చేసుకుందాం” అన్నాడు మౌల్వీ సాబ్. ఇద్దరూ పడమటి వైపు తిరిగి మోకాళ్ల పైకి వంగి కూచొని అంతా మరిచిపోయి నిష్కల్మశంగా, నిష్టగా అల్లాను ప్రార్థించుకున్నారు. తమ దుఃఖాన్ని, వేదనను శుభ్రపరుచుకొని అప్పుడే పుట్టిన నూతన శిశువుల్లా పవిత్రంగా మారారు. అరచేతులతో ముఖాన్ని అద్దుకున్నారు. కండ్లు తెరిచి మళ్లీ ఒకళ్లనొకళ్లు చూసుకొని చిరునవ్వులు నవ్వుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. ”అల్విదా మౌల్వీ సాబ్” ఖాన్సాబ్ కొంచెం వంగి తల వంచి కుడిచేయిని కిందికీ పైకి ఊపుతూ మూడు సార్లు సలాం చేస్తూ చేస్తూ వెనకకు నడిచాడు. వీడ్కోలు సమయంలో పెద్దవాళ్లకు వీపు చూపించటం మర్యాద కాదు.
”అల్లా ఆప్ కో సలామత్ రఖే” దీవించాడు మౌల్వీ. ఇద్దరూ విడివిడిగా కాలినడకన గల్లీలల్ల నుండి నడుచుకుంటూ, ఎవరైనా వెంబడిస్తున్నారేమోనని చుట్టుపక్కల గమనిస్తూ బేగం బజారులోని సేఠ్ పూరణ్మల్ బంగ్లాకు వెళ్లారు. ఆ సేఠ్ అప్పటికే రెండు మేలిమి అరబ్బు గుర్రాలను కొంత నగదును సిద్ధం చేసి పెట్టాడు. వాళ్లిద్దరూ అక్కడే వేషాలు మార్చుకొని సేఠ్కు కృతజ్ఞతలు తెలిపి పురానాపూల్ వైపు వెళ్లిపోయారు. ”అసలైన భూమి పుత్రులు” అంటూ రెండు చేతులూ జోడించి ఆకాశానికి దండం పెట్టాడు సేఠ్ పూరణ్మల్.
* * *
తలల మీద వెలలు రెసిడెన్సీపై దాడి జరిగినందుకు నిజాం నవాబు, దివాన్ సాలార్జంగులు తమ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ రెసిడెంట్కు ఉత్తరాలు రాశారు. నైజాం ప్రభుత్వం తిరుగుబాటుదారులకు ఆశ్రయం కల్పించారని, కుట్రదారులకు ఆర్థిక సహాయం అందించారని జయగోపాల్ దాస్ను ఆయన కొడుకులను ఇంకా అబ్బాస్ సాహెబ్ కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసింది. వారి ఆస్తులను జప్తు చేసింది. అరబ్బు గుండాలు వారి ఇండ్లపై దాడి చేసి సామానుల్ని లూఠీ చేసి వారి భవంతులను నేటమట్టం చేశారు. ఆ షావుకారుల కుటుంబాలు ‘అన్నమో రామచంద్రా’ అని వీధిన పడ్డాయి. జీవచ్ఛవాలయ్యారు. నైజాం ప్రభుత్వం మౌల్వీ అల్లావుద్దీన్, తుర్రేబాజ్ఖాన్ తలల మీద వెలలు ప్రకటించి వారిని పట్టిచ్చిన వారికి ఐదు వేల రూపాయల చొప్పున బహుమతి ఇస్తామని తెలియజేసింది. తుర్రేబజ్ఖాన్ మారువేషంలో బెంగుళూరుకు వెళ్లుతుండగా మహబూబ్నగర్ జిల్లా మొగిలిగిద్ద వద్ద పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి విచారణ జరిపారు.
కేసు విచారణ జరుగుతున్నప్పుడు తుర్రేబాజ్ ఖాన్ చాలా ధైర్యంగా అనేక విషయాలను చెప్పాడు. తను తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు గర్విస్తున్నానని చింతించటం లేదని తెలిపాడు. అయితే ఆ తిరుగుబాటు విఫలం అయిన కారణాలను కూడా స్పష్టంగా వివరించాడు. అది సమర్థవంతమైన నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా జరిగిన తిరుగుబాటు కాదని, అనేక మంది అనేక విధాలైన వాగ్దానాలు చేసినా అసలు సమయానికి వారు జారుకున్నారని, అయినా తాను ఎవరినీ నిందించనని, పవిత్రమైన తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చానన్న తృప్తి మాత్రం తనకు మిగిలిందని, తాము విజయం సాధించకున్నా ఒక నిరసనను, ధిక్కారాన్ని తెలియజేసామని చాలా నిజాయితీగా, చిత్తశుద్ధితో అదాలత్లో ప్రకటించాడు. ఎంత వత్తిడి చేసినా మౌల్వీ అల్లావుద్దీన్ ఎవరో తనకు తెలియదని చెప్పాడు. తిరుగుబాటు పూర్తి బాధ్యత తనదేనని తెలిపాడు. తన పోషకుడైన బుద్దాన్ఖాన్ను మాత్రం ఈ కుట్రకేసులో ఇరికించవద్దని కోర్టువారిని ప్రార్థించాడు. విచారణ జరిపి అతనికి అండమాన్ జైలులో ఒంటరి కొట్టులో యావజ్జీవ శిక్ష విధించారు. అతనిని అక్కడికి తరలించాలని ప్రయత్నిస్తుండగానే 1859 జనవరి 18న ఆయన మెరుపుతీగలాగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత రెండు రోజులకే మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో అతని ఆచూకీ దొరికింది. కుర్బాన్ అలీ అనే ద్రోహి ఇచ్చిన ఆచూకీ ద్వారా అతడిని పట్టుకున్నారు. కాని పోలీసులతో జరిగిన ఘర్షణలో అతను అక్కడే వీరమరణం చెందాడు. అయినా అతడి మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చి కోఠీ చౌరస్తాలో రోజుల తరబడి గొలుసులకు వేలాడదీశారు. ఉరికొయ్యకు ఊయలలూగిన దేశభక్తుడు తుర్రేబాజ్ఖాన్. ఆ వీరుడి శవాన్ని చూసి నగర ప్రజలందరూ కంటతడిపెట్టారు. తిరుగుబాటు తర్వాత మౌల్వీ అల్లాఉద్దీన్ మాత్రం బెంగుళూరుకు పారిపోయి మంగళంపల్లి అనే గ్రామంలో తలదాచుకున్నాడు. పీర్మహమ్మద్ అనే వ్యక్తి ఆయనకు ఆశ్రయమిచ్చాడు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆయనను సయ్యద్బిక్కు, సయ్యద్లాల్, మహమ్మద్ అలీ అనే తిరుగుబాటు నేతలు కలిసి సంప్రదింపులు జరిపేవారు. చివరికి బ్రిటిష్ వారు అతనిని కూడా అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. కోర్టు తీర్పు 1858 జూన్ 28న వెలువడింది. అండమాన్లో యావజ్జీవ శిక్ష విధించారు. ఆ వృద్ధుడు 1884లో అల్లాకు ప్రియతముడైనాడు. తన జాతి జనులను పెనునిద్దుర నుంచి మేల్కొల్పిన అతను ఇరవై ఆరు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను అనుభవించి చివరికి పెను విశ్రాంతిలోకి వెళ్లిపోయాడు. అయితే ఆ తిరుగుబాటు గాథ అంతటితో అంతరించలేదు. 1857లో తిరుగుబాటు జరిగినా 1867 వరకూ పది సంవత్సరాల పాటు దాని ప్రభావం కొనసాగుతూనే వచ్చింది. ఉద్రిక్త పరిస్థితి అట్లాగే ఉంది. 1857 తిరుగుబాటును అణిచేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం నిజాంను ఆయన దివాన్ను ఉచితరీతిన సత్కరించింది. వెంటనే 50 లక్షల రూపాయల అప్పును మాఫీ చేయటమేగాక గతంలో తాము కైవసం చేసుకున్న బీరార్లోని కొంత ప్రాంతాన్ని, రాయ్చూర్ జిల్లాలోని నల్దుర్గ్ను, సురపురాన్ని నిజాంకు వాపస్ ఇచ్చేశారు. 1861లో ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అన్న బిరుదును ప్రసాదించారు. విశ్వాసపాత్రుడైన స్నేహితుడు అన్న బిరుదు కూడా ఇచ్చారు. ఆ బిరుదుల్ని ప్రధానం చేయటానికి ఒక ప్రత్యేకమైన దర్బార్ను ఏర్పాటు చేశారు. కాని అప్పటికే నిజాం ”గులాం” ప్రవర్తనతో హైద్రాబాదీయులు కోపంతో రగిలిపోతున్నారు. నిరసన లోలోపల రగులుతున్నది.
నిజాంకు ఆ బిరుదుల్ని అందచేసి రెసిడెంట్ డేవిడ్సన్, దివాన్ సాలార్జంగులు ఇవతలికి వస్తుండగా జహంగీర్ఖాన్ అనే రోహిల్లా పఠాన్ తన తుపాకీతో రెసిడెంటుపై మెరుపుదాడి చేశాడు. కాని అతను తప్పించుకోగా తన ఒర నుంచి తల్వార్ తీసి కలియబడ్డాడు. కాని ఆ దాడి కూడా విఫలం చెంది అతను బందీ అయ్యాడు. చిత్రహింసలకు గురైన జహంగీర్ఖాన్ని కొన ఊపిరితో ఆస్పత్రికి పంపి చికిత్స చేయించి కొలుకోగానే మళ్లీ చిత్రహింసలు పెట్టి ఆ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరున్నారో చెప్పమని వత్తిడి చేశారు. ఆ యోధుడు పెదవి విప్పలేదు. చివరికి చెరసాలలోనే కన్నుమూశాడు. ఈ తిరుగుబాటు సందర్భంగా హైద్రాబాద్ సంస్థానంలోని చిన్న చిన్న రాజులు, జమీందార్లు, కూడా అందులో పాల్గొని తమ జీవితాలను సమిధలుగా ఆహుతి ఇచ్చారు. అనేక త్యాగాలు చేసి కఠిన శిక్షలకు గురైనారు. వారిలో ఒకరు సురపురం రాజా వెంకటప్ప నాయక్. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ దగ్గర ఓ ఊరి పేరు ‘వెయ్యి ఊళ్ల మర్రి’. వాడుకలో ఆ పేరు సంతరించుకుంది గాని అసలు పేరు ‘వెయ్యి ఊడల మర్రి’. నిజంగా ఆ ఊర్లో ఇప్పటికీ మర్రిచెట్టు ఉంది. వెయ్యి ఊడలూ ఉన్నాయి. 1857 తిరుగుబాటు నిర్మల్లో జరిగి విఫలమైనప్పుడు బ్రిటిష్వారు ఒక్కొక్క ఊడకు ఒక్కొక్కరిని ఉరివేశారు. అందుకే ఆ ఊరికి వెయ్యి ఊడల మర్రి అని పేరొచ్చింది. ఆ తిరుగుబాటు గిరిజనుల గోండు వీరుడు ‘రాంజీ’ నాయకత్వంలో జరిగింది. ఆ మర్రిచెట్టు ఒక్కొక్క కొమ్మా ఒక్కో కథను చెప్పుతుంది. 1860లో నిర్మల్ పట్టణంలో రాంజీ గోండ్ అనుచరులకు బ్రిటిష్ సైన్యానికి యుద్ధం జరిగి ఆయనను బందీగా పట్టుకుని వెయ్యి ఊడల మర్రిచెట్టుకు ఉరితీశారు. గిరిజన గోండు తెగకు చెందిన ఒక మామూలు వ్యక్తి రోహిల్లాలకు, మరాఠాలకు, బ్రాహ్మణులకు నాయకత్వం వహించడం మామూలు సంగతి కాదు.
సర్ కటా సక్తేఁ హై లేకిన్ సర్ జుకా సక్తే నహీఁ
ఉత్తరాదిన విప్లవం విఫలం కాగానే రావు సాహెబ్ పీష్వా యుద్ధవ్యూహంలో భాగంగా 1862లో హైద్రాబాద్కు వచ్చి రహస్యంగా బేగంబజారులో తలదాచుకున్నాడు. స్థానిక ప్రజలు, వ్యాపారులు ఆయనకు ఆశ్రయం ఇచ్చారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అక్కడ ఆయన అనేక మారు పేర్లతో వ్యవహరించాడు. బేగంబజారులో అప్పటికే కిషన్రావు అనే విప్లవకారుడు తలదాచుకున్నాడు. వారిద్దరూ కలిసి మళ్లీ సైన్యాన్ని సమీకరించేవారు. తమతో చేతులు కలిపిన వారికి విప్లవ చిహ్నంగా శాలువాలను బహూకరించేవారు. నిజామాబాద్కు చెందిన ఆర్మూర్ తాలుకాలోని మోర్తాడ్ గ్రామానికి చెందిన భూస్వామి రుక్మారెడ్డి, నగరంలోని బాలముకుంద్ బాగుకు చెందిన పూజారులు లింగయ్య, అంతయ్యలు, బ్రిటిష్ సైన్యంలో పని చేసే బల్దేవ్ ప్రసాద్, మదురా ప్రసాద్, గణేష్సింగులు మరో అజ్ఞాత మహిళ రావు సాహెబ్కు అనుచరులుగా పని చేశారు. ఆ అజ్ఞాత మహిళ గురించి తెలుసుకోవటానికి బ్రిటిష్ వారు ఎంతో ప్రయత్నం చేశారు కాని కనీసం పేరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆ ప్రయత్నాలన్నీ ప్రభుత్వానికి తెలిశాయి. బేగంబజార్లో ఇల్లిల్లూ సోదా చేశారు. వరుసగా అనేక మందిని అరెస్టు చేశారు. రుక్మారెడ్డి, తుల్జారామ్, రామ్ రతన్ సింగు అనే వ్యాపారిని తొలుత అరెస్టు చేశారు. అయితే రామ్ రతన్ సింగు తప్పించుకున్నాడు. రెండవసారి మళ్లీ పట్టుకుంటే విషముష్ఠి పలుకుల్ని మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సూత్రధారులు రావు సాహెబ్, కిషన్ రావులు మాత్రం మెరుపు తీగల్లాగా మాయమైనారు. పాదరసం లాగ జారిపోయారు.
సేఠ్ మోహన్లాల్ పిత్తీ రావు సాహెబ్ను ముస్లిం జంగుపూల్ కింద ఉన్న గోసాయిల మఠంలో సన్యాసిగా ఉంచాడు. తుర్రేబాజ్ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్లను గతంలో తప్పించిన సేఠ్ మోహన్లాల్ను, పూరణ్మల్ను ఇద్దరినీ అరెస్టు చేసి, మోహన్లాల్కు 75 వేలు, పూరణ్మల్కు 10 వేలు జరిమానాలు విధించారు. ఆ తిరుగుబాటుకు ”బేగం బజార్ కుట్రకేసు’ అని పేరు పెట్టారు. రావు సాహెబ్ మెదక్ జిల్లాల్లోని నార్సింగిలో వున్నాడని తెలిసి పోలీసులు అక్కడికి పరిగెత్తారు. అనుచరుడు దొరికాడు కాని అగ్రనాయకుడు మాత్రం మళ్లీ తప్పించుకున్నాడు.
రావు సాహెబ్ను చివరికి కాన్పూరులో పట్టుకుని 1862 ఆగస్టులో ఉరి తీశారు.
బ్రిటిష్వారికి హమేషా సహకరించిన దివాన్ సాలార్జంగుపై 1867లో నగరంలో ఒక హత్యాప్రయత్నం జరిగి విఫలమయ్యింది. దీనితో పదేళ్ల తర్వాత 1857 తిరుగుబాటు పూర్తిగా అంతరించింది. 1956లో ఆ సిపాయిల తిరుగుబాటుకు వందేళ్లు నిండిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోఠీ బస్స్టాండ్ చౌరస్తాలో అమరవీరుల స్తూపాన్ని స్థాపించింది. ఆ అమరజీవుల గురించి నేటి తరానికి మిగిలిన ”వారసత్వ జ్ఞాపకం” అదొక్కటే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి